అన్విక, బోసినవ్వుల కలబోసి , కబన్ పార్క్ విహారం

నిన్న 29 ఉదయం అల్పాహారం చేసి, ఉద్యానవన బెంగళూరు, మేఘావృతమై చిరుజల్లులు వెదజల్లే వేళ ,అన్విక ఆటలు ,అరుపులు పెడుతుంటే ,కబన్ పార్క్ వెళ్లి కాసేపు ప్రాణవాయువులు పీలుద్దామని ,మా ఈషా కోరగానే అందరం కారెక్కాము .

ఉదయం బెంగళూరు మెజెస్టిక్ సర్కిల్ ప్రాంతం మొత్తం ఒక పర్ణశాల పోలి ఉంటుంది 
నాకు ,నిన్నే మొదటి సారి అనిపించింది ,విదేశాలకి వెళ్లాలంటే వీసా లు హాలిడే ప్యాకేజీలు ఇవ్వన్నీ బోలెడు ప్రయాసలు పడాలి ,అవన్నీ లేకుండా ,వానాకాలం బెంగళూరు లో వారం గడిపితే చాలు యూరోప్ వెళ్ళినట్లే ..  
పెద్ద  పెద్ద శిరీష వృక్షాలు వీధులన్నిటినిమీదా పడగలా కప్పేసి ,వీధుల కిరు వైపులా చక్కటి ,పాదచారులు క్షేమంగా నడవడానికి వేసిన "నడవ " లకి నీడ నిస్తూంటే ,ఆ వీధుల్లో నడవడమే ఆనందం ,అనిపించని వాడికి ,మన పాదచారులకు  నడిచే ,వీలే లేకుండా చేసిన భాగ్యనగరమే,శరణ్యం!


దారిలో ఒక "నడవ " నానుకు ఉన్న Keventers ,అనే  చిలకిన పాల పానీయం(MILKSHAKE) వద్ద ఆగి , (Cunningham Road లో)
అక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒక పెద్ద పొడుగాటి మన పూర్వం డైరీ ఫారం పాల సరఫరా, పోలిన గాజు సీసా లో కమ్మటి  చిలికిన పాలు (సీసా సహా పట్టుకెళ్లొచ్చు), తీసుకుని ,అన్విక తో ఫోటోలు తీసుకుని ( అక్కడ ''అన్విక తో ఫోటో!'', 5 డాలర్లు అన్నా , క్యూ కట్టడానికి జనాలు సిద్ధంగా ఉండటం చూసి ) గబా గబా కారెక్కి ముందుకురికాము. 


దసరా ఉత్సవాలు మొదలు ,జనాలు అరటి మొక్కలు పట్టుకెళ్ళడం లో మునిగి ఉన్నందున పార్క్ లో పలుచగా జనం.

ఆకాశమంతా పచ్చని ఆకులతో పరిచేసినట్లు ఉంది ,చెట్ల కిందుగా మాకు 
ఆకుపచ్చని రంగు ,వివిధ రకాలుగా,
 చిక్కగా ,పలుచగా రకరకాల ఆకులకుండా, జల్లెడ పట్ట -బడి 
అన్విక ముఖాన పులుముకుంది . 

గుల్మొహర్ ఎరుపు అందరికీ తెలిసిందే ,
పసుపు పచ్చని గుల్మొహర్ పోలిన Colvillea Racemosa ఒక చోట,
 కొన్ని కొమ్మలే అపురూపంగా విరబోస్తే ,
నేలమీద వెదజల్లాయి పసుపు,
కనకాంబరం కలబోసిన మొగ్గలు,
విచ్చుకున్న రేకులతో ,
అక్కడ అడుగులు వేయలేము, 
ఆ రంగుకు ,ముచ్చట పడకుండా!









కొన్ని పొడవాటి వృక్షాలు,తీగలల్లుకుని ,
నిన్న కురిసిన వానకి తడిసిన నేలా ,
వింతయిన రంగు రాళ్లు 
చుట్టూ క్రూర మృగాలు లేని అరణ్యం 
అదే 'కబ్బన్ పార్క్'!

ఒక చోట ఒక చిన్న ,నీటి దిమ్మ ,
దాని మీద ,
మన చిన్నప్పటి కధలో కాకి ఒకటి 
సమయానికి ,మా అనిరుధ్  అడగ్గా 
కాకి పోజ్ ఇచ్చింది 
నీళ్లు తాగి ఎగిరిపోవడం 
సెల్ ఫోన్లో బంధించుకోమని..








చివరికి ,అనుకున్న దేమిటంటే..

కబ్బన్ పార్క్ కి, ఒక మారే రావడం కుదరదు,
పలుమార్లు పలకరించాలిసిందే!
బెంగళూరు వచ్చినపుడల్లా,
ఆ ఆకు పచ్చని పందిళ్ళలో 
తిరుగాడాలసిందే !సేద తీరాల్సిందే!


Comments

  1. Chaalaa baavundi varnana. Aa pradesaalannee choosina anubhooti kalugutunnadi.

    ReplyDelete
  2. Enta baga varninchVante ippude velli povalani వుంది. అసలే బెంగళూరు అంటే ఏమిటో తెలియని పిచ్చి నాకూ మొదటి నుంచీ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిక్ బల్లాపూర్ లో ఈ వారం

విమాన యాత్ర ,రెండు అంగల్లో ఒమాన్ మీదుగా మిలాన్